ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పంత్ జట్టుపై సౌరాష్ట్ర విజయం సాధించింది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో…..12 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర, 10 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘనవిజయాన్ని నమోదు చేసింది.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రఫ్పాడించాడు. ఢిల్లీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 12 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకు గొప్ప విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు (5/66) పడగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో (7/38) ఏడు వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లోనూ 38 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవ్వగా.. జడేజా ఒక్కడే అసాధారణ ప్రదర్శన కనబర్చడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన రిషబ్ పంత్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో (1 పరుగు) ధర్మేంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటవ్వగా… రెండో ఇన్నింగ్స్‌లో (17 పరుగులకు) రవీంద్ర జడేజాకు వికెట్ లభించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 49.4 ఓవర్లలో 188 పరుగుల చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఆయుష్ బదోని (60) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. 271 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. హార్విక్ దేశాయ్ (93), అర్పిత్ వాసవాడ (62) రాణించారు.
ఇక 83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 25.2 ఓవర్లలో 94 పరుగులు చేసి కుప్పకూలింది. తద్వారా సౌరాష్ట్రకు 12 పరుగుల లక్ష్యాన్ని అందించారు. దీంతో సౌరాష్ట్ర 15 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది.