చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం (67 నాటౌట్) తో రాణించాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు ఇదే తొలి పరాజయం. మరోవైపు చెన్నై మూడో విజయాన్ని నమోదు చేసింది.
ధోనీ రికార్డును సమం చేసిన జడేజా
మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా సమం చేశాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన సీఎస్కే ప్లేయర్‌గా నిలిచాడు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు ఈ అవార్డ్స్ గెలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), హస్సీ (10) ఉన్నారు.
జడ్డూ పేరిట అరుదైన ఘనత
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కేకేఆర్‌తో మ్యాచులో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచులో రెండు క్యాచ్ లు పట్టడం ద్వారా ఐపీఎల్లో 100 క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. దీంతో ముంబై మాజీ సారధి రోహిత్ శర్మతో కలిసి జడేజా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో 110 క్యాచ్ లతో రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) ఉన్నారు.