ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్‌లో ఇవ్వాల (ఆదివారం) అదరగొట్టింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో రెండో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ(30), టిమ్ డెవిడ్ (24) మెరుపులు తోడవ్వడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వీరోచిత శతకం వృథా అయ్యింది. నితీశ్ రానా సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. లక్ష్య చేదనలో ముంబై ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
65 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(20) ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (58) మరింత దీటుగా ఆడాడు. 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో యాభై రన్స్ కొట్టాడు. హాఫ్ సెంచరీ కొట్టి ఊపుమీదున్న అతడిని వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. దాంతో, 87 రన్స్ వద్ద ముంబై రెండో వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(30), సూర్యకుమార్ యాదవ్(43) మూడో వికెట్‌కు 690 రన్స్ జోడించారు. వీళ్లిద్దరూ ఔటయ్యాక టిమ్ డెవిడ్(24) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.
అయ్యర్.. వీర బాదుడు
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 185 రన్స్ చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(104) శతకంతో చెలరేగాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడిన అయ్యర్ 51 బంతుల్లోనే 104 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఆండ్రూ రస్సెల్(21), రింకూ సింగ్ (18) మాత్రమే రాణించారు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీశాడు. గ్రీన్, జాన్‌సెన్, రిలే మెరిడిత్, పీయూష్ చావ్లాకు ఒక్కో వికెట్ దక్కింది.