భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మహ్మద్ సిరాజ్ వంటి యువ బౌలర్లను ప్రోత్సహించే ప్రక్రియలో ఇషాంత్ భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. శతక టెస్టుల ధీరుడిగా రికార్డు సాధించిన ఇషాంత్ చివరిగా 2021లో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
అయితే వచ్చే నెల నుంచి స్వదేశంలో టెస్టు సందడి మొదలుకానుండటంతో 35 ఏళ్ల ఇషాంత్ భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ యువ ప్లేయర్లతో కలిసి ఈ ఆరు అడుగుల పేసర్ ఆడనున్నాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ‘పురానీ ఢిల్లీ 6’ జట్టులో రిషభ్ పంత్‌తో కలిసి ఇషాంత్ శర్మ ఆడనున్నాడు. భారత్ తరఫున ఇషాంత్ 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 115,పొట్టి ఫార్మాట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.