Sunday, November 24, 2024

BCCI దెబ్బకు దిగొచ్చిన ఇషాన్‌, శ్రేయస్‌..

టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఎట్టకేలకు దిగొచ్చారు. జాతీయ జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు తప్పనిసరిగా ఆడాలని గత కొద్ది రోజులుగా భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ జట్టులో ఫామ్‌ కోల్పోయిన లేదా విరామం తీసుకుంటున్న క్రికెటర్లు తిరిగి భారత జట్టులో రావాలంటే దేశవాళీ క్రికెట్‌ టోర్నీలు ఆడాల్సిందేనని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐ హెచ్చరించింది.

అయినా వీటిని పట్టించుకోకుండా అయ్యర్‌, ఇషాన్‌ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ వీరి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ రద్దు చేసేందుకు సిద్ధమైందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంకా ఐపీఎల్‌ కూడా ఆడలేరని హెచ్చరించడంతో వీరిద్దరూ మొట్టు దిగారు. కాగా, రంజీ సెమీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ముంబై జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. శనివారం నుంచి ప్రారంభం కానున్న సెమీస్‌ మ్యాచ్‌లో ముంబై జట్టు తమిళనాడుతో తలపడనుంది.

మరోవైపు ఇషాన్‌ కిషన్‌ ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్‌ టీ20 టోర్నీతో మంగళవారం రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు మూడు నెలల విరామానంతరం మైదానంలో అడుగుపెట్టిన ఇషాన్‌ ఆర్‌బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మంగళవారం ఆర్‌బీఐ, రూట్‌ మొబైల్‌ లిమిటెడ్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన మొబైల్‌ లిమిటెడ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో తడబడిన ఆర్‌బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఇషాన్‌ కిషన్‌ 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement