Saturday, November 23, 2024

భువనేశ్వర్‌ అలసిపోయాడా.. ఫేస‌ర్ తీరుపై ఆందోళ‌న‌

టీమిండియా పేస్‌దళపతి భువనేశ్వర్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్‌ను కట్టడిచేయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం సమస్యగా మారింది. ఇది ఏకంగా జట్టు విజయాలను తారుమారు చేస్తోంది. ఆసియా కప్‌లో కీలకమైన పాక్‌, శ్రీలంక మ్యాచ్‌లలోనూ, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలోనూ ఈవైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. త్వరలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్నందున అతడి బౌలింగ్‌పై విమర్శలు తీవ్రం అవుతుండటంపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించారు.

భువనేశ్వర్‌ ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుండటమే సమస్యకు కారణమని చెప్పారు. తద్వారా అలసట చెందుతున్నాడని, అది అతని బౌలింగ్‌ లయపై ప్రభావం చూపుతోందని చెప్పుకొచ్చాడు. భువనేశ్వర్‌ను నేను చాలా ఏళ్లుగా చూస్తున్నాను. అతను పనిభారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తికాదు. ఈ ఏడాది కూడా చాలా మ్యాచ్‌లు ఆడాడు.. ఆడుతున్నాడు కూడా. విరామం తర్వాత తిరిగి జట్టులోకి వస్తే, ప్రారంభంలో మంచి ప్రదర్శనచేస్తాడు. అందువల్ల భువనేశ్వర్‌ బౌలింగ్‌పై ఎక్కువగా ఆందోళన అవసరంలేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులలో మూడో పేసర్‌ను అందుబాటులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఈ కోణంలో హర్షల్‌పటేల్‌ కంటే షమీనే సరైన ప్రత్యామ్నాయం అని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement