Friday, November 22, 2024

IPL : ముంబైకి తొలి గెలుపు ద‌క్కేనా… ఓట‌మి ఎరుగ‌ని ఆర్ఆర్‌తో ఢీ

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ సీజన్‌లో రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుండగా.. ముంబై ఇండియన్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

- Advertisement -

రాజస్థాన్‌తో నేటి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌కు సొంత మైదానంలో మొదటిది కావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ నేతృత్వంలో ముంబై తొలిసారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ ఆడుతుంది. హార్దిక్‌ను ముంబై కెప్టెన్‌గా స్వీకరించలేకపోతున్న రోహిత్‌ అభిమానులు వాంఖడేలో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి.

మరోవైపు రాజస్థాన్‌ ప్రత్యర్ధి గ్రౌండ్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. రాయల్స్‌ ఇప్పటివరకు ఆడి, గెలిచిన రెండు మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లోనే కావడంతో ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఏ మేరకు రాణిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ముంబై వరుసగా గుజరాత్‌, సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలు కాగా.. రాయల్స్‌.. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై వరుస విజయాలు సాధించి సూపర్‌ ఫామ్‌లో ఉంది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్స్‌ను ముంబై ఏ మేరకు నిలువరించగలుగుతుందో వేచి చూడాలి.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా ముంబై 15, రాజస్థాన్‌ 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ముంబై నాలుగింట జయకేతనం ఎగురవేసింది.

తుది జట్లు (అంచనా)..
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మఫాకా.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్.

ఇక, ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లోను ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అయినా విజయం సాధించాలని కసితో ఉంది ముంబై ఇండియన్స్. ఈ మేరకు హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టు కసరత్తులు చేస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి మూడో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement