నలుగురు ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడటంతో ఐపీఎల్ టోర్నీని వాయిదా వేసింది బీసీసీఐ. లీగ్ కోసం కఠినమైన బయో బబుల్ ఏర్పాటు చేసిన ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడటం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పటికీ బబుల్‌లోకి వైరస్ ఎలా వచ్చిందన్నదానిపై స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై స్పందించాడు. బబుల్ ఉల్లంఘన జరగలేదని మాకు అందిన రిపోర్ట్ ప్రకారం తేలింది. అయితే వైరస్ ఎలా చొరబడిందో చెప్పడం చాలా కష్టం. అదే కాదు దేశంలో ఇంత మందికి వైరస్ ఎలా సోకిందో చెప్పడం కూడా కష్టం అని గంగూలీ అన్నాడు.
బబుల్‌లోకి వైరస్ రాకుండా ప్రొఫెషనల్స్ కూడా అడ్డుకోలేరు. ఇంగ్లండ్‌లో సెకండ్ వేవ్ సందర్భంగా కూడా ఇదే జరిగింది. ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ బబుల్‌లోకి వైరస్ చొరబడింది. మాంచెస్టర్ సిటీ, ఆర్సెనల్ ప్లేయర్స్ వైరస్ బారిన పడ్డారు అని గంగూలీ వెల్లడించాడు.ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఐపీఎల్ రీషెడ్యూల్ చేయడం అంత సులువు కాదు. ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ అయితే ఆరు నెలల షెడ్యూల్ కాబట్టి వాళ్లు రీషెడ్యూల్ చేయగలిగారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్లేయర్స్‌ను ఆయా దేశాలకు రిలీజ్ చేయాలి. రీషెడ్యూలింగ్ చాలా కష్టం అని గంగూలీ అన్నాడు. యూఏఈలో నిర్వహించాలని మొదట అనుకున్నా.. లీగ్ ప్రారంభమయ్యే సమయానికి ఇండియాలో పెద్దగా కేసులు లేకపోవడంతో అలాగే ముందుకు వెళ్లామని చెప్పాడు.