IPL 14వ సీజన్ సెప్టెంబర్ లో పునప్రారంభం కానుంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ కి మరోసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని నిర్వహకులు ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోర్నీకి మరోసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా కఠినమైన కొవిడ్ ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేసింది. సిక్స్ కొడితే బాల్ మార్చడం, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే ప్లేయర్స్‌ను యూఏఈకి తరలించడం సహా మరెన్నో కొత్త కొవిడ్ నిబంధనలు వచ్చి చేరాయి.
- సిక్స్ కొట్టినప్పుడు బాల్ స్టాండ్స్‌లో లేదా స్టేడియం బయట పడితే.. ఫోర్త్ అంపైర్ వెంటనే మరో బాల్ అందించాలి. ఆ స్టాండ్స్ లేదా బయటపడిన బాల్‌ను ఆల్కహాల్ ఆధారిత వైప్స్‌తో శానిటైజ్ చేసి బాల్స్ లైబ్రరీలో ఉంచాలి. ఆ తర్వాత ఎప్పుడైనా అవసరమైతే ఆ బాల్ ఇవ్వొచ్చు. క్రికెట్ బాల్ ద్వారా కొవిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే అని బీసీసీఐ ఓ శాస్త్రీయ అధ్యయనం ద్వారా చెప్పినా.. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ అనుమతించినా వారిని స్టేడియంలోని పైన ఉన్న స్టాండ్స్‌లో మాత్రమే కూర్చోబెడతారు.
- ఇక గ్రౌండ్‌లో ఉమ్మడం, ముక్కు చీదడం వంటివి చేయకూడదు. కేవలం వాష్‌రూమ్‌లకు మాత్రమే అవి పరిమితం.
- ప్లేయర్స్, సిబ్బంది బయో బబుల్‌లోకి వెళ్లే ముందు ఆరు రోజుల ఐసోలేషన్‌లో ఉండాలి. మూడు నెగటివ్ పరీక్షలు తప్పనిసరి. ఇంగ్లండ్‌లో ఉన్న ఇండియన్ ప్లేయర్స్ బబుల్ నుంచి బబుల్‌లోకి మారేందుకు కొన్ని గైడ్‌లైన్స్ పాటిస్తే.. దుబాయ్‌లో వారికి క్వారంటైన్ అవసరం లేదు.
- ఇంగ్లండ్‌లో ఇండియా టూర్, శ్రీలంకలో సౌతాఫ్రికా టూర్, కరీబియన్ ప్రిమియర్ లీగ్ ముగిసిన తర్వాత ప్లేయర్స్, సిబ్బంది, కామెంటేటర్లు, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది అందరూ వారి వారి బయో బబుల్స్‌లోనే కొనసాగాలి. వీళ్లందరినీ హోటళ్ల నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన బస్సులలో ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అవసరం లేకుండా నేరుగా విమానాల దగ్గరికే తీసుకెళ్తారు. దీని కారణంగా వీళ్లు బయటి వ్యక్తులతో కలవకుండా జాగ్రత్తపడతారు.
- దుబాయ్‌లో ఉన్న గోల్ఫ్ క్లబ్ మినహాయించి ప్లేయర్స్, సిబ్బంది.. బార్లు, రెస్టారెంట్లు, కెఫేలు, జిమ్‌లకు వెళ్లడం నిషేధం.
- ఒకవేళ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఎవరైన అభిమాని గ్రౌండ్‌లోకి వచ్చి ప్లేయర్స్‌ను తాకితే.. సదరు ప్లేయర్స్ వెంటనే గ్రౌండ్ బయటకు వెళ్లి తమ దుస్తులను మార్చుకోవాలి. ఆ తర్వాత చేతులను 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇతర ప్లేయర్స్‌తో కలవాలి.
- ప్లేయర్స్ తమ వాటర్ బాటిల్స్‌ను ఎవరికి వారే ఉపయోగించాలి. ఒకరి బాటిల్ మరొకరు వాడకూడదు.