అహ్మదాబాద్ – సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్(89 నాటౌట్) శివాలెత్తిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతడు పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. అచ్చొచ్చిన స్టేడియంలో వీరబాదుడుతో గుజరాత్‌కు భారీ స్కోర్ అందించాడు. గిల్ విధ్వంసానికి సాయి సుదర్శన్(33), కేన్ విలియమ్సన్(26), రాహుల్ తెవాటియా(23 నాటౌట్)ల మెరుపులు తోడవ్వడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
టాస్ ఓడిన గుజరాత్‌కు ఆదిలోనే పంబాబ్ కింగ్స్ పేసర్ రబడ షాకిచ్చాడు. డేంజరస్ వృద్ధిమాన్ సాహా(11)ను ఔట్ చేశాడు. బౌండరీతో జోరుమీదున్న సాహా బౌండరీ వద్ద ధావన్ చేతికి చిక్కాడు. ఆతర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్(26), సాయి సుదర్శన్(33)లు ధాటిగా ఆడారు
వీళ్లిద్దరూ ఔటైనా గిల్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హర్షల్ పటేల్, రబడ ఓవర్లో భారీ సిక్సర్లు బాదాడు. విధ్వసంక ఆటగాడు డేవిడ్ మిల్లర్ లేనందున భుజాన వేసుకున్నాడు. చివరిదాకా నిలబడి జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. చివర్లో రాహుల్ తెవాటియా(23 నాటౌట్) దంచాడు. పంజాబ్ బౌలర్లలో రబడ రెండు వికెట్లు పడగొట్టాడు.