– ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లిలో ఐపీఎల్ బెట్టింగ్ జోరందుకుంది. ప్రస్తుతం ఆన్లైన్ వేదికగా ఈ మాయలో పడి యువత ఉన్నది కాస్తా ఊడగొట్టుకుంటున్నారు. ఒందరు మాత్రం పోయిన చోట వెతుక్కోవాలని అప్పులు చేసి మరి బెట్టింగ్‌లు పెడుతూ మరింత అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారు. గత ఐపిఎల్ సీజన్లలో ఎన్నో కుటుంబాలు ఈ సరదాకు బలయ్యాయి. ఇప్పటికే భూపాలపల్లి సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంతో పాటు గణపురం, కాటారం, మహాదేవపూర్, మొగుళ్ళపల్లి , చిట్యాల, టేకుమట్ల, తదితర జిల్లాలోని సుమారు అన్ని ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ జోరుగా కొనసాగుతుందనే ప్రచారం వినవస్తుంది. ప్రధాన నగరాలైన ముంబై, హైదరాబాద్, వరంగల్ , ఆంధ్రప్రదేశ్‌ల నుండి ఎక్కడిక్కడ గ్రూపులు ఏర్పాటు చేసి గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారితో వాట్సప్ , ఆన్లైన్ లింక్‌ల ద్వారా ఈ బెట్టింగ్ దందా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఒక ప్రాంతానికి చెందిన వారికి లింకు పంపి వారికి అత్యంత నమ్మకమైన వ్యక్తులతో ఈ దందా కొనసాగిస్తున్నారు. రూ.1000 నుండి మొదలై లక్షల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బెట్టింగ్ లో జిల్లాలో పలువురు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారనే గుసగుసలు వినవస్తున్నాయి. డబ్బు అత్యాశతో అప్పుల పాలవుతున్నారు. ఈ ఐపిఎల్ ముగిసే వరకు ఎన్ని కుటుంబాలు ఈ మాయకు బలవుతారోనని పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన జిల్లా టాస్క్‌ఫోర్స్, నిఘా విభాగాలు, పోలీసులు ఈ దందా పై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.