ఐపీఎల్ 14వ సీజన్ మలిదశ మ్యాచ్‌లను ఇంగ్లండ్ వేదికగా జరుపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడకపోతే జూన్ తర్వాత మెగాటోర్నీ తరలింపుపై ఆలోచన మొదలుపెట్టాలని అనుకుంటున్నది. బయోబబుల్‌లో కరోనా కేసులు నమోదవడంతో అర్ధాంతరంగా వాయిదా వేసిన సీజన్‌ను స్వదేశంలో నిర్వహించే పరిస్థితులు లేవు. దీంతో ప్రత్యామ్నాయాలపై బోర్డు ఆలోచిస్తున్నది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఇంగ్లండ్ అయితే మేలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ విషయంపై ఈనెల 29న జరిగే ఎస్‌జీఎమ్‌లో చర్చించనుంది. ఇంగ్లిష్ కౌంటీ క్లబ్‌లు సైతం ఐపీఎల్ ఆతిథ్యానికి ముందుకు రాగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సుముఖంగా ఉంది. అయితే అక్కడ టోర్నీ నిర్వహిస్తే ఖర్చుల భారం ఎక్కువవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తున్నది.
ఈ అంశాలు సహా దేశవాళీ సీజన్ నిర్వహణపైనా ఈనెల 29న జరుగనున్న ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో బీసీసీఐ ముమ్మరంగా చర్చించనుంది. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సహా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడేందుకు భారత్ జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది.