హైదరాబాద్: లాల్‌బహదూర్ స్టేడియంలో అంతర్జాతీయ స్కేటింగ్ రింక్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా నూతనంగా బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్కేటింగ్ రింక్‌లో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులతో మంత్రి చర్చించారు. క్రీడాకారులు, కోచ్‌లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్కేటింగ్ రింక్ చాలా సంవత్సరాల క్రితం నిర్మించడంతో ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేదని వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్ రింక్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి సాట్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తత రింక్‌ను విస్తరించి ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను క్రీడా మంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం క్రీడాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బాస్కెట్‌బాల్, స్కేటింగ్ క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ చైర్మన్ అల్లిdపురం వేంకటేశ్వర్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, సాట్స్ ఉన్నతాధికారులు సుజాత, ధనలక్ష్మి, మనోహర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.