ఇండోనేషియ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాడు. మరోవైపు సింగిల్స్‌లో ప్రియాంషు రజావత్ ఓటమిపాలయ్యాడు. డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-9, 21-15 తేడాతో జపాన్ స్టార్ కెంటా నిషిమోటోను వరుస గేముల్లో చిత్తు చేశాడు.
ఆది నుంచే చెలరేగి ఆడిన సేన్ వరుస స్మాష్‌లతో జపాన్ ప్రత్యర్థిని చిత్తుచేసి దర్జాగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక్కడ జరిగిన మరో సింగిల్స్ మ్యాచ్‌లో ప్రియాంషు రజావత్ 10-21, 17-21 తేడాతో వరల్డ్ చాంపియన్, 8వ సీడ్ కున్లావత్ వితిద్‌సర్న్ (థైలాండ్) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మహిళల డబుల్స్‌లో నిరాశే..
గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రిసా జాలీ జోడీ 21-19, 19-21, 19-21 తేడాతో ఏడో సీడ్ మయు మత్సుమోటో-వాకనా నాగారా (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట చివరి వరకు అద్భుతంగా పోరాడినా లాభం లేకుండా పోయింది.
మరో డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ద్వయం 13-21, 21-19, 13-21 తేడాతో రెండో సీడ్ దక్షిణ కొరియా జంట బేక్ హా నా-లీ సొ హీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కి రెడ్డి జోడీ 9-21, 11-21 తేడాతో జెంగ్ సీ వీ-హువాంగ్ య ఖియోంగ్ (చైనా) ద్వయంపై ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.