ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా ఇవ్వాల (బుదవారం) జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో భారత షట్లర్లు లక్ష్య సేన్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని చూస్తున్న ప్రపంచ నం19 సేన్, తన ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో వరుస సెట్లలో 24 -22, 21-15 తేడాతో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. ఇక సెంకండ్ రౌండ్లో డెన్మార్క్‌కు చెందిన అండర్స్ ఆంటోన్సెన్ లేదా ఇండోనేషియాకు చెందిన చికో ఔరా ద్వి వార్డోయోతో తలపడనున్నాడు.
మరోపైపు.. 2022 ఒడిశా ఓపెన్, 2023 డెన్మార్క్ మాస్టర్స్‌లో సూపర్ 100 టైటిళ్లను గెలుచుకున్న 23 ఏళ్ల జార్జ్, ఓపెనింగ్ గేమ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్‌పై 18-21, 21-16, 21-19 తేడాతో విజయం సాధించాడు. ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన జార్జ్, నిన్న (మంగళవారం) జంట విజయాలు నమోదు చేసి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. కాగా, కిరణ్ జార్జ్ తన రెండో రౌండ్లో చైనాకు చెందిన లుగువాంగ్జుతో తలపడనున్నాడు.
అయితే, హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ లకు తమ ప్రారంభ మ్యాచ్‌లలో నిరాశే మిగిలింది. ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూతో తలపడిన ప్రణయ్ 18-21, 21-19, 10-21 తేడాతో ఓడిపోయాడు. ఇక, ఎలాగైనా పారిస్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించాలని ఆరాట పడుతున్న శ్రీకాంత్‌కు ఓటమితప్పలేదు. మలేషాయాకు చెందిన లీ జియాతో జరిగిన పోటీలో 21-19, 14-21, 11-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.