ప్రతిష్టాత్మక థామస్-ఉబెర్ కప్‌లో భారత మహిళా, పురుషుల జట్ల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన థామస్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో పోరులో డిఫెండింగ్ చాంపియన్ పురుషుల జట్టు చైనా చేతిలో 1-3తో.. ఉబెర్ కప్‌లో మహిళల జట్టు 0-3 తేడాతో జపాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక్కడ జరిగిన పురుషుల క్వార్టర్స్ మ్యాచ్ తొలి సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21-15, 11-21, 14-21 తేడాతో షి యు క్వీ చేతిలో ఓటమితో ఆరంభించాడు.
తర్వాత జరిగిన డబుల్స్‌లో భారత స్టార్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 15-21, 21-11, 12-21 తేడాతో లియాంగ్ వి కెంగ్-వాంగ్ చాంగ్ జంట చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత జరిగిన కీలక సింగ్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 13-21, 21-8, 21-14తో లీ షి ఫెంగ్‌పై అద్భుత విజయం సాధించి చైనా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాడు.
అనంతరం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో ధ్రువ్ కపిలా-సాయి ప్రతీక్ జోడీ 10-21, 10-21 తేడాతో వరుస గేమ్‌లలో ఓడటంతో భారత్ ఆశలు అవిరయ్యాయి. వరుసగా థామస్ కప్ రెండో టైటిల్‌పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ పురుషుల జట్టు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.
అంతకుముందు జరిగిన మహిళ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత యువ షట్లర్లు పటిష్టమైన జపాన్ చేతిలో 0-3తో చిత్తయ్యారు. సింగిల్స్‌లో అష్మిత, ఇషారాణిలు… డబుల్స్‌లో ప్రియ-శ్రుతి జంట వరుస మ్యాచుల్లో ఓటమి పాలవడంతో భారత క్వార్టర్స్‌లోనే ఇంటి బాట పట్టింది.