Saturday, November 23, 2024

Women’s T20 WC | రేపు భారత్‌ కీలక పోరు.. శ్రీలంకతో అమీతుమీ !

ఉత్కంఠ భరీతంగా సాగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్‌-ఏలో పోటీ పడుతున్న భారత జట్టు సెమీస్‌కు చేరాలంటే రేప‌టి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. లేదంటే ఈ మెగా టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టమవుతోంది.

ఐసీసీ వరల్డ్‌కప్‌ ట్రోఫీయే లక్ష్యంగా బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి తర్వాత రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఇక రేపు శ్రీలంకతో జ‌రిగే కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం తమ గ్రూప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ 4వ, శ్రీలంక 5వ చివరి నుంచి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

అయితే టీమిండియా ఒక విజయం సాధించగా.. శ్రీలంక మాత్రం వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక పాక్‌పై నెగ్గిన హర్మన్‌ సేన సెమీస్‌ రేసులో నిలిచినా.. మరో రెండు కఠిన సవాళ్లను ఎదురుకోవాల్సి ఉంది. ముందు ఆసియా కప్‌ విజేత శ్రీలంకతో తర్వాత ఆరు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ కొననుంది.

ఈ మ్యాచుల్లో ఒకటి ఓడినా టోర్నీ నుంచి ఆవుటే. మరోవైపు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌లో ఆడుతుందో లేదో అనుమానమే. బుధవారం మ్యాచ్‌ సమయానికి ఆమె పూర్తిగా కోలుకుంటేనే బరిలోకి దిగుతుంది.

ఇక వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంలో విఫలమవడం టీమిండియాకు కలవరపెడుతోంది. మిగతా బ్యాటర్లు కూడా ధాటిగా ఆడలేక పోతున్నారు. బౌలింగ్‌ టీమిండియా కాస్త పర్వాలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అందరూ కలిసికట్టుగా రాణిస్తే లంకను ఈజీగా ఓడించగలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement