మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళలు తమ జోరును కొనసాగిస్తున్నారు. సెమీఫైనల్‌లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో 3-2 తేడాతో జపాన్‌ను ఓడించారు.
మొదటి మ్యాచ్‌లో పీవీ సింధు పోరాడి ఓడింది. అయా ఒహోరి చేతిలో 13-21, 20-22 తేడాతో ఓటమిపాలైంది. అయితే.. రెండో మ్యాచ్‌లో భారత జోడీ గాయత్రీ గోపిచంద్-త్రిసా జోడీ 21-17, 16-21, 22-20 తేడాతో నమీ మత్సుమయ-చిహారు షిదపై గెలుపొందింది. ఈ క్రమంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే తదుపరి మ్యాచ్‌లో అష్మితా 21-17, 21-14 తేడాతో ఒకుహరపై గెలుపొందింది. దీంతో జపాన్ పై 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
మరో గేమ్‌లో డబుల్స్ గేమ్‌లో తనీషా క్రాస్టో గాయంతో రిటైర్ అవ్వడంతో.. అశ్విని పొన్నప్పతో పీవీ సింధు జత కట్టింది. అయితే వారు ప్రపంచ మియుర-అయకో సుకురమోటో పై 21-14, 21-11 తేడాతో ఓడిపోయారు. దీంతో 2-2తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. కీలకమైన ఐదో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ చేరుకుంటారు. ఈ కీలక మ్యాచ్‌లో యువ షట్లర్ అనయోల్ ప్రపంచ 29 ర్యాంకర్ నత్సుకి నిదైతో 52 నిమిషాల పాటు పోరాడి 21-14, 21-18 తేడాతో విజయం సాధించింది.
ఫలితంగా 3-2 తేడాతో భారత్ బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) జరగనుండగా.. భారత్ జట్టు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. కాగా అంతక ముందు గ్రూప్ దశలో బలమైన చైనా కోటను బద్ధలు కొట్టిన మన షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో హాంకాంగ్‌ను 3-0తో చిత్తుగా ఓడించారు.