భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలింది. చీఫ్ కోచ్‌గా ఉన్న జన్నెకె స్కాప్‌మన్ నివారం తన పదవికి రాజీనామా చేసింది. ‘భారత మహిళల సీనియర్ హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా. హాకీ ఇండియా, సాయ్‌లకు ముందస్తు నోటీస్ పంపిస్తున్నా. మార్చి 23వ తేదీన నా పదవి ముగుస్తుంది. నాకు రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని కోరుతున్నా. భారత జట్టుతో తాను కొనసాగిన సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ స్కాప్‌మన్ వెల్లడించింది.
ఈ ఏడాది ఆగస్టు వరకు హాకీ ఇండియాతో కాంట్రాక్ట్ ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత 46 ఏండ్ల స్కాప్‌మన్ జట్టును వీడాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఐదు నెలల ముందే ఆమె రాజీనామా సమర్పించింది. గతవారం హాకీ ఇండియాపై ఆమె తీవ్రమైన అరోపణలు చేసింది. తనను ఎవరూ గౌరవించడం లేదని, భారత్‌లో మహిళలకు తగిన ప్రాధాన్యం లేదని స్కాప్‌మన్ ఆరోపించింది. దాంతో, ఆమె కోచ్ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే స్కాప్‌మన్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించింది.
నెదర్లాండ్స్‌కు చెందిన స్కాప్‌మన్ 2020 జనవరిలో అనలిటికల్ కోచ్‌గా భారత జట్టులో చేరింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టింది. స్కాప్‌మన్ ఆధ్వర్యంలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2022 ఆసియా కప్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. అంతేకాదు నిరుడు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బంగారు పతకం గెలిచింది. అయితే.. ప్రతిష్ఠాత్మకమైన ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించలేక పోయింది.