బెంగళూరు: భారత హాకీ జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. భారత జట్టులోని ఇద్దరు క్రీడాకారులు, ముగ్గురు అధికారులకు కొవిడ్ వైరస్ సోకినట్లు హాకీ ఇండియా అధికారవర్గాలు వెల్లడించాయి. కామన్వెల్త్ గేమ్స్-2022 కోసం బెంగళూరులోని ఎస్‌ఏఐ కేంద్రంలో హాకీ పురుషుల జట్టు క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం క్రీడాకారులకు ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, ఐదుగురికి స్వల్పంగా కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వెల్లడైంది. దీంతో వారందరినీ ఐసొలేషన్‌కు తరలించినట్లు హాకీ ఇండియా గురువారంనాడొక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో బెల్జియం, నెదర్లాండ్స్‌తో ఆడి, సోమవారంనాడే బెంగళూరు ఎస్‌ఏఐ సెంటర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు జులై 23న 31 మంది క్రీడాకారులున్న హాకీ ఇండియా జట్టు బయలుదేరనుంది. జులై 31న ఘనతో మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తోపాటు పూల్-బీలో ఉన్న ఇండియా జట్టు కెనడా, వేల్స్‌తో రౌండ్-రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.