Friday, November 22, 2024

జింబాబ్వేతో వ‌న్డే సిరీస్‌ను గెలిచిన భార‌త్‌.. వ‌రుస‌గా రెండో వ‌న్డేలో విక్ట‌రీ కొట్టిన టీమిండియా

తొలుత ఇంగ్లండ్‌, త‌ర్వాత వెస్టిండీస్ టూర్ల‌లో రాణించిన భార‌త క్రికెట్ జ‌ట్టు తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ స‌త్తా చాటింది. 3 వ‌న్డేల వ‌న్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే… భార‌త చేజిక్కించుకుంది. జింబాబ్వేలోని హ‌రారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా సాగుతున్న రెండో వ‌న్డేలో జింబాబ్వే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని టీమిండియా బ్యాట‌ర్లు కేవ‌లం 25.4 ఓవ‌ర్ల‌లోనే చేధించి విజ‌యం సాధించారు. వెర‌సి ఇంకో వ‌న్డే మ్యాచ్ మిగిలి ఉండ‌గానే… టీమిండియా వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకోగా… ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల పాటు క్రీజులో నిల‌బ‌డ‌లేక‌పోయింది. 38.1 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగులు చేసిన జింబాబ్వే జ‌ట్టు చాప చుట్టేసింది. ఆ త‌ర్వాత ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన టీమిండియా స‌గం ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది.

శిఖ‌ర్ ధావ‌న్ (33)తో క‌లిసి టీమిండియా బ్యాటింగ్‌ను ప్రారంభించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) ఒక్క‌టంటే ఒక్క ప‌రుగు చేసి అవుట‌య్యాడు. ఆ త‌ర్వాత గ‌బ్బ‌ర్‌కు జ‌త క‌లిసిన శుభ్‌మ‌న్ గిల్ (33) డ‌బుల్ డిజిట్ స్కోరుతో రాణించాడు. త‌ర్వాత వ‌చ్చిన ఈషాన్ కిష‌న్ (6), ఆక‌ట్టుకోలేక‌పోయాడు. త‌ద‌నంత‌రం క్రీజులోకి వ‌చ్చిన దీప‌క్ హుడా (25), వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ (43) రాణించారు. హుడా అవుట‌వ్వ‌డంతో క్రీజులోకి వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్ (6) ప‌రుగుల‌తో శాంస‌న్‌తో క‌లిసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌల‌ర్లు ప‌రుగులు ఇవ్వ‌కుండా అడ్డుకోగ‌లిగితే…జింబాబ్వే బౌల‌ర్లు మాత్రం భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. చివ‌రాఖ‌రుకు 25.4 ఓవర్లు ముగిసేస‌రికి 5 వికెట్ల న‌ష్టానికి భార‌త జ‌ట్టు 167 ప‌రుగులు చేసి వ‌రుస‌గా రెండో విక్ట‌రీ కొట్టేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement