భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లోని చివరివన్డేలో మిథాలీసేన విజయం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన సిరీస్‌లోని ఐదో వన్డేలో భారతజట్టు 6వికెట్లు తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిథాలీరాజ్‌తోపాటు స్మతి మంధాన, హర్మాన్‌ప్రీత్‌కౌర్ హాఫ్‌సెంచరీలతో సత్తా చాటారు. ఇప్పటికే 5వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకోగా చివరివన్డేలో గెలిచిన మిథాలీసేనకు ఈ విజయం ఊరటనిచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్లు నష్టానికి 251పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ బేట్స్ (17) నిరాశపరిచినా మరో ఓపెనర్ కెప్టెన్ డివైన్ 34పరుగులు చేసి ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో పరుగులు వరద పారిస్తున్న అమిలీయా కెర్ 75బంతుల్లో 6ఫోర్లుతో 66 పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో మెరిసింది.
మొత్తంమీద న్యూజిలాండ్ 9వికెట్లు కోల్పోయి 251పరుగులు చేసింది. భారత బౌలర్లలో గైక్వాడ్, స్నేహ్‌రాణా, దీప్తీశర్మ తలో రెండు వికెట్లు తీయగా మేఘనాసింగ్, పూనమ్‌యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం న్యూజిలాండ్ నిర్దేశించిన 251పరుగుల విజయలక్ష్యాన్ని మిథాలీసేన మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 46వ ఓవర్లో ఛేదించింది. టీమిండియా కెప్టెన్ మిథాలీ, ఓపెనర్ స్మృతి మంధాన, హర్మాన్‌ప్రీత్‌కౌర్ ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. స్మృతి 84బంతుల్లో 9ఫోర్లుతో 71పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో అదరగొట్టింది. హర్మన్‌ప్రీత్‌కౌర్ 66బంతుల్లో 6ఫోర్లు, ఓసిక్స్‌తో 63పరుగులు చేసి మెరిసింది. మరోవైపు కెప్టెన్ మిథాలీరాజ్ 66 బంతుల్లో 6ఫోర్లుతో 57పరుగులు చేసి అర్ధశతకంతో అజేయంగా నిలిచింది. రీచాఘోష్ (7) నాటౌట్‌గా నిలిచింది. స్మృతి, మిథాలీ అర్ధశతకాలతో అదరగొట్టడంతో భారతజట్టు 4వికెట్ల నష్టానికి 255పరుగులు చేసి గెలుపొందింది. న్యూజిలాండ్ పర్యటనలో ఏకైక టీ20తోపాటు తొలి నాలుగు వన్డేల్లోనూ పరాజయంపాలైన మిథాలీసేనకు ప్రపంచకప్ ముంగిట ఈ విజయం ఊరటనిచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..