పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోణి అదిరిపోయింది. పెర్త్ టెస్టులో కంగారూలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే భారత్ జట్టు సగర్వంగా 295 పరుగుల తేడాతో గెలిచి గెలుపు జెండా ఎగురవేసింది. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 534 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్‌ను 238 పరుగులకే టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. దాంతో ఐదు టెస్టుల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది.
పెర్త్ లాంటి పిచ్‌పై 534 పరుగుల లక్ష్యఛేదన అసాధ్యం. అయితే.. ఆస్ట్రేలియా కనీసం మ్యాచ్ డ్రా కోసమైనా పోరాడుతుందని అంతా ఊహించారు. కానీ.. భారత్ బౌలర్ల ముందే ఆస్ట్రేలియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ (0), ఉస్మాన్ ఖవాజా (4) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన నైట్ వాచ్మెన్ పాట్ కమిన్స్ (2), మార్కస్ లబుషేన్ (3) కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా చేరుకోలేకపోయారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ 17/4తో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.
ఈ దశలో ట్రావిస్ హెడ్ (89: 101 బంతుల్లో 8×4), మిచెల్ మార్ష్ (47: 67 బంతుల్లో 3×4, 2×6) ఆ జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడితో ఆస్ట్రేలియా డ్రా ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ.. ట్రావిస్ హెడ్‌ను బుమ్రా చేసేయగా.. మిచెల్ మార్ష్‌ను నితీశ్ రెడ్డి బోల్తా కొట్టించాడు.
ఇక ఆఖర్లో అలెక్స్ క్యారీ (36), మిచెల్ స్టార్క్ (12), నాథన్ లయన్ (0) జోష్ హేజిల్‌వుడ్ (4) కాసేపు క్రీజులో నిలిచినా.. వారి ఆరాటం ఆస్ట్రేలియా టీమ్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు.. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.