శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సభ్యులంతా గెలుపు కానుక అందజేశారు. కోహ్లీ వందో టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. కోహ్లీకి మరిచిపోలేని విజయాన్ని అందజేసింది. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ షోతో.. తొలి టెస్టులో ఇన్నింగ్స్, 222 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ సైతం తొలి టెస్టు మ్యాచ్‌లోనే అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. మూడో రోజు ఆటలో శ్రీలంక జట్టు మొత్తం చేతులు ఎత్తేసింది. రెండు సార్లు ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు టెస్టుల మ్యాచ్ సిరీస్‌లో 1-0తో భారత్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే టెస్టును ముగించారు.
తొలి ఇన్నింగ్స్‌లో.. టీమిండియా 574/8 భారీ స్కోర్ వద్ద తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత్ బ్యాటర్లు రవీంద్ర జడేజా 175 పరుగులతో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ 96, రవిచంద్రన్ అశ్విన్ (61), హనుమ విహారీ (58) పరుగులతో రాణించారు. మిగిలిన వారిలో కోహ్లీ (45), మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29), శ్రేయస్ అయ్యర్ (27), షమీ (20) రాణించారు. లంక బౌలర్స్‌లో లక్మల్, ఎంబుల్దెనియా, ఫెర్నాండో రెండేసి వికెట్లు తీశారు. కుమార, డిసిల్వా తలో వికెట్ తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన లంక..
108/4 వద్ద ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. 65 ఓవర్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో పాతుమ్ నిస్సంక (133 బంతుల్లో 11 ఫోర్లతో 61 నాటౌట్) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. లక్మల్, ఎంబుల్దెనియా, ఫెర్నాండో, లహిరు కుమారాలు డకౌట్‌గా పెవిలియన్ చేరుకున్నారు. అసలంక (29), మాథ్యూస్ (22), కరుణరత్నే (28), తిర్మానే (17) మినహా అందరూ విఫలం అయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలకం జట్టు 65 ఓవర్లు ఆడి 174 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలింగ్‌లో జడేజా 5, అశ్విన్, బుమ్రాకు రెండేసి వికెట్లు దొరికాయి. షమీకి ఒక వికెట్ దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలం..
400 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆరంభించిన శ్రీలంక బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేశారు. డిక్‌వెల్లా (51 నాటౌట్), ధనంజయ డిసిల్వా (30), మాథ్యూస్ (28), కరుణరత్నే (27), అసలంక (20) మినహా ఎవరూ రాణించలేదు. జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ముందు లంకేయులు నిలవలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. దీంతో చివరికి 60 ఓవర్స్‌లో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జట్టు ఇన్నింగ్స్ 222 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్స్‌లో జడేజా 4, అశ్విన్, షమీకి 2 వికెట్లు దొరికాయి. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు (డే అండ్ నైట్) 12వ తేదీ నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కానుంది.
సంక్షిప్త స్కోర్ బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 574/8 డిక్లేర్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 174 పరుగుల వద్ద ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 178 పరుగుల వద్ద ఆలౌట్
ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..