Sunday, December 22, 2024

B.G.T | సమరోత్సాహంతో భారత్… రేప‌టి నుంచి రెండో టెస్ట్ !

ప్రతిష్టాత్మకమైన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు శుభారంభం చేసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. రేప‌టి నుంచి ఆడిలైడ్‌ వేదికగా భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య డే అండ్‌ నైట్‌ (పింక్‌ బాల్‌) టెస్టు మొదలు కానుంది.

సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మ‌రోవైపు తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసిన కంగారూ జట్టు.. టీమిండియాకు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. అడిలైడ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన రికార్డును కలిగి ఉండటంతో ఈ మ్యాచ్‌కు గట్టిపోటీ ఖాయమనిపిస్తోంది.

అయితే గత మ్యాచ్‌కు దూరమైన టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడు. ఇది భారత్‌కు శుభపరిణామం. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.

- Advertisement -

కోహ్లీ, బుమ్రాలును ఊరిస్తున్న కొత్త‌ రికార్డులు..

విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఆసీస్‌ గడ్డపై మరో సెంచరీ సాధిస్తే విదేశీ గడ్డపై అత్యధిక శతకాలు చేసిన దిగ్గజ బ్యాటర్‌ డాన్‌ బ్రాడ్‌మాన్‌ రికార్డును సమం చేస్తాడు. ఆసిస్‌ దిగ్గజం బ్రాడ్‌మాన్‌ ఇంగ్లండ్‌ గడ్డపై 11 శతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్టార్‌ కోహ్లీ ఆసీస్‌ గడ్డపై 10 సెంచరీలతో కొనసాగుతున్నాడు.

జస్ప్రీత్‌ బుమ్రా మరో వికెట్‌ తీస్తే.. టెస్టుల్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కొత్త ఘనత సాధిస్తాడు.

మిడిల్‌ ఆర్డర్‌లో రోహిత్‌..

ఇక గురువారం జరిగిన ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన స్థానంపై స్పష్టత ఇచ్చాడు. తొలి టెస్టులాగే ఆడిలైడ్‌ మ్యాచ్‌లోనూ యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని రోహిత్‌ పేర్కొన్నాడు. తాను మాత్రం ఈసారి మిడిల్‌ ఆర్డర్‌లో ఆడబోతున్నాని కూడా రోహిత్‌ చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాడు.

దీంతో పింక్‌ బాల్‌ టెస్టుకు వారి ఓపెనింగ్‌ స్థానం కన్ఫర్మ్‌ అయిపోయింది. వీరి తర్వాత శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతారు. ఆ తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ బాధ్యతలను కెప్టెన్‌ రోహిత్‌ స్వీకరించనున్నాడు. రోహిత్‌ తర్వాత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బరిలోకి దిగుతాడు. అనంతరం యువ ఆల్‌రౌండర్‌ ఆంధ్ర అబ్బాయి నితీష్‌ కుమార్‌ రెడ్డి బ్యాటింగ్‌ చేసేందకు రెడీగా ఉన్నాడు.

ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్ల కోటలో విషింగ్టన్‌ సుందర్‌ స్థానం దాదాపు ఖాయమనిపిస్తోంది. మరోవైపు పేస్‌ దళానికి ఎప్పటిలాగే భారత స్టార్‌ జస్ప్రీత్‌ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా.. అతడికి తోడుగా హైదరాబాదీ యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌తో పాటు హర్షిత్‌ రాణాలు కంగారూలను కంగారూ పెట్టించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ప్లెయింగ్‌ ఎలెవన్‌ దాదాపుగా ఖాయమైందనే చెప్పాలి. వీరందరూ కలిసి రాణిస్తే రెండో టెస్టులోనూ టీమిండియాకు భారీ విజయం దక్కడం ఖాయమే.

ఆసీస్‌కు కఠిన సవాల్‌..

తొలి టెస్టులో ఓడిన ఆస్ట్రేలియాకు నేటి నుంచి ప్రారంభమయ్యే పింక్‌ బాల్‌ టెస్టు కఠిన సవాల్‌గా మారింది. అయితే ఈసారి టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చి ఈ మ్యాచ్‌ను గెలుచుకుంటామని ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఆడిలైడ్‌లో ఆసీస్‌ మంచి రికార్డు ఉండటం వారికి కలిసొచ్చే అంశం ఉంది. ఇక్కడ ఏడు డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా అన్నింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం కంగారూ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో పటిష్టంగా ఉంది.

తుది జట్ల వివరాలు (అంచనా)

భారత్‌: యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖ్వాజా, నాథన్‌ మెక్‌స్వీనీ, మర్నస్‌ లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మిఛెల్‌ స్టార్క్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియాన్‌, స్కాట్‌ బోలాండ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement