Saturday, November 23, 2024

India vs Newzealand.. t20 battle నేడే..

ప్ర‌భ‌న్యూస్: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 నేడు జైపూర్‌లో జరగనుంది. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాత్రి 7గంటల నుంచి తొలి టీ20 జరగనుంది. ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌కోహ్లీ వైదొలగడంతో హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి తప్పుకోవడంతో రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. రోహిత్‌, ద్రవిడ్‌ కలయికలో టీమిండియా ప్రయాణం నేటినుంచి ప్రారంభంకానుంది. ఐపీఎల్‌లో ముంబైజట్టును ఛాంపియన్‌గా నిలిపి కెప్టెన్‌గా రోహిత్‌శర్మ విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు ద్రవిడ్‌కూడా ఇండియా-ఎ, అండర్‌-19 కోచ్‌గా సక్సెస్‌ అయ్యాడు.

నేటి నుంచి రోహిత్‌-రాహుల్‌ ద్వయం 2022 టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ లక్ష్యంగా ముందుకు వెళ్లనుంది. కాగా జైపూర్‌లో టీ20 మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. గత ఎనిమిదేళ్లలో భారతజట్టు ఇక్కడ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. పిచ్‌ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. జైపూర్‌లో రాత్రి సమయంలో విపరీతంగా మంచు కురుస్తుంది. దీంతో ఈ సిరీస్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మంచు ప్రభావం తగ్గించేందుకు రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఆర్‌సీఎ) రసాయనాలను ఉపయోగిం చాలని భావిస్తోంది. ఇషాన్‌కిషన్‌ ఓపెనర్‌గా వస్తే కేఎల్‌ రాహుల్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. ద్రవిడ్‌ ప్రయోగాలుకు తెరతీస్తే సూర్యకుమార్‌ వన్‌డౌన్‌లో దిగేఅవకాశం ఉంది.

భారత్‌తో నేటి నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. కేన్‌ స్థానంలో పేసర్‌ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే కివీస్‌ జట్టును బోర్డు ప్రకటించింది. టెస్టు సిరీస్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్న దృష్ట్యా నవంబర్‌ 25నుంచి కాన్పూర్‌లో మొదలవనున్న టెస్టు సిరీస్‌కు బ్లాక్‌క్యాప్స్‌ కెప్టెన్‌ కేన్‌ హాజరుకానున్నాడని కివీస్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం జరగనున్న తొలి టీ20కి న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ సౌథీ సారథ్యం వహిస్తాడని, పొట్టి సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌కు కైల్‌ జెమీసన్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ శాంట్నర్‌ అందుబాటులో ఉండనున్నారు. గాయం నుంచి కోలుకున్న లోకీ ఫెర్గూసన్‌ టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. ఆదివారం టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడిన న్యూజిలాండ్‌ కేవలం రెండు రోజుల విరామం తర్వాత భారత్‌తో సిరీస్‌కు సిద్ధమైంది.

ఇప్పటివరకు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య 17టీ20 మ్యాచ్‌లు జరగ్గా భారత్‌ 6మ్యాచ్‌ల్లో గెలిస్తే, న్యూజిలాండ్‌ 9మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి. భారత్‌ వేదికగా ఇరుజట్లు 5మ్యాచ్‌ల్లో తలపడితే న్యూజిలాండ్‌ 3మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే భారత్‌ 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. అత్యధిక పరుగులు చేసిన క్రికెట ర్ల జాబితాలో రోహిత్‌శర్మ 14ఇన్నింగ్స్‌లో 352 పరు గులుతో టాపర్‌గా ఉన్నాడు. రోహిత్‌ తర్వాత కోహ్లీ 10ఇన్నింగ్స్‌లో 311పరుగులు, కేఎల్‌ రాహుల్‌ 6ఇన్నింగ్స్‌ల్లో 242పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

భారత్‌ అంచనా జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌పంత్‌, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌పటేల్‌/హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌/సిరాజ్‌, చాహర్‌, చాహల్‌.

- Advertisement -

న్యూజిలాండ్‌ అంచనా జట్టు: డారిల్‌ మిచెల్‌, మార్టిన్‌ గప్తిల్‌, మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, టిమ్‌ సీఫెర్ట్‌ (వికెట్‌కీపర్‌), నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, అడమ్‌ మిల్నే, టిమ్‌ సౌథీ (కెప్టెన్‌), ఇష్‌ సోధీ, ట్రెంట్‌ బౌల్ట్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement