ఇంగ్లండ్ పై 106 పరుగుల తేడాతో గెలుపు ..
తొమ్మిది వికెట్లతో రాణించిన బూమ్రా…
నాలుగు రోజులలోనే ఇంగ్లండ్ ఖేల్ ఖతం
తొలి ఇన్నింగ్స్ లో యశస్వీ ద్విశతకం..
రెండో ఇన్నింగ్స్ లో గిల్ శతకం ..
విశాఖ: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్ క్రాలే (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు . ఉప్పల్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా విశాఖలో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను 106 పరుగులతో ఓడించి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటయ్యింది. టామ్ హర్ట్లే(36)ను బుమ్రా బౌల్డ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా 1-1తో సిరీస్ సమం చేసింది.
ఓవర్‌నైట్ స్కోర్ 67/1తో నాలుగో రోజు ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ ధాటిగా ఆడింది. నైట్ వాచ్‌మన్ రెహాన్ అహ్మద్(23) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. అక్షర్ పటేల్ అతడికి చెక్ పెట్టి వికెట్ల వేటను అరంభించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన అశ్విన్ ఉప్పల్ టెస్టు హీరో ఓలీ పోప్(23)ను ఔట్ చేశాడు. స్లిప్‌లో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో పోప్ పెవిలియన్‌కు చేరగా.. ఆ కాసేపటికే రివర్స్ స్వీప్‌తో రెండు బౌండరీలు బాదిన జో రూట్(16)ను యష్ బోల్తా కొట్టించాడు. దాంతో, స్టోక్స్ సేన 154 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.
స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ విజృంభించడంతో తొలి సెషన్లో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్‌కు ముందు ఓవర్లో డేంజరస్ బెయిర్‌స్టో (26)ను బుమ్రా ఎల్బీగా వెనక్కి పంపాడు. అప్పటికీ ఓపెనర్ జాక్ క్రాలే (73), జానీ బెయిర్‌స్టో(26) క్రీజులో ఉండడంతో మ్యాచ్ దాదాపు ఇంగ్లండ్ వైపే ఉంది. అయితే.. చైనామన్ కుల్దీప్ యాదవ్ సూపర్ డెలివరీతో క్రాలే ఎల్బీగా వెనుదిరిగాడు. లంచ్‌కు ముందు ఆఖరి ఓవర్లో బుమ్రా.. డేంజరస్ బెయిర్‌స్టోను ఎల్బీగా ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. టెయిలెండర్లతో కలిసి పోరాడతాడనుకున్న కెప్టెన్ బెన్ స్టోక్స్(11) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ హర్ట్లే(36), బెన్ ఫోక్స్(36) కౌంటర్ అటాక్‌తో భారత బౌలర్లను కొద్దిసేపు విసిగించారు. కానీ, బుమ్రా ఈ ఇద్దరిని పెవిలియన్ పంపడంతో భారత్ విజయఢంకా మోగించింది. అశ్విన్, బూమ్రాలకు మూడేసి వికెట్లు లభించగా, కులదీప్ , అక్షర్ , ముఖేష్ కుమార్ లకు తలో వికెట్ లభించింది.. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి తొమ్మిది వికెట్లు సాధించిన బూమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది..
భారత్ తొలి ఇన్నింగ్స్ ..396 ..రెండో ఇన్నింగ్ – 255
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ – 253.. రెండో ఇన్నింగ్స్ 292