భారత్ పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు చిరకాల ప్రత్యర్థులు పోట్లాడుకోబోతున్నారు. టీ 20 వరల్డ్ కప్ 2021లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా.. టీ 20 వరల్డ్ కప్ జోరును ఆసియాకప్ లోనూ కొనసాగించాలని పాక్ ప్లాన్ వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- పాక్ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత జట్టును మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా వేశాడు.
ఓపెనర్లుగా వారిద్దరే..
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా పాక్‌తో ఆడబోయే భారత జట్టును అంచనా వేశాడు. ఓపెనర్లుగా కెఎల్ రాహుల్ , రోహిత్ శర్మలు బరిలోకి దిగే చాన్సుందన్నాడు. వన్ డౌన్ లో కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడతారని జోస్యం చెప్పాడు. ఐదో స్థానంలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బరిలోకి దిగితే బావుంటుందన్నాడు. అయితే ఆరోస్థానంలో మాత్రం పంత్, దినేష్ కార్తిక్‌లలో ఒకరికి మాత్రమే చోటివ్వాలని చెప్పాడు. ఏడో స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆడుతాడని చెప్పాడు. ఏడో స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆడుతాడని చెప్పాడు. 8వ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌కు స్థానం ఉంటుందని అంచనా వేశాడు.
పంత్‌కు బదులు కార్తిక్
చాహల్ మొదటి స్పిన్నర్‌గా బరిలోకి దిగుతాడని భావించిన వసీం జాఫర్ .. రెండో స్పిన్నర్‌గా మాత్రం అశ్విన్‌కు బదులు రవి బిష్ణోయ్‌కు చోటిచ్చాడు. అటు దినేష్ కార్తీక్, రిషభ్ పంత్‌లలో ఒకర్ని మాత్రమే తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాడు. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం పంత్‌కు బదులు కార్తిక్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నాడు.
అర్షదీప్‌కు అవకాశం
పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భువికి తోడుగా అర్ష్ దీప్ సింగ్ ఆడే చాన్సుందని వసీం జాఫర్ అంచనావేశాడు. వీరిద్దరితో పాటు మూడో పేసర్‌గా హార్థిక్ పాండ్యా బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చాహల్ , రవి బిష్ణోయ్‌లకు చోటు దక్కుతుందన్నాడు. వీరికి అండగా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉంటాడని చెప్పాడు. మొత్తంగా ఇద్దరు ఆల్ రౌండర్లతో కలిపి ఆరుగురు బౌలింగ్ చేస్తారని అంచనా వేశాడు. అయితే దుబాయ్ పిచ్‌లు నెమ్మదిగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ఉండేలా భారత్ టీమ్‌ను ఎంచుకునే అవకాశం ఉందన్నాడు.
కీలక బౌలర్ అవుట్
ఆసియాకప్‌లో భాగంగా రేపు భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా పేసర్ షాహీన్ ఆఫ్రిది జట్టుకు దూరంకాగా ఇప్పుడు వెన్ను నొప్పితో మరోపేసర్ మహమ్మద్ వసీమ్ అందుబాటులో లేకుండా పోయాడు.