జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో పాక్ తో తలపడిన భారత్… 5-3 తేడాతో చిత్తు విజయం సాధించింది. కాగా, ఈ విజయంతో భారత జట్టు వరుసగా మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది ఐదో టైటిల్. గతంలో భారత్ 2004, 2008, 2015, 2023లో విజేతగా నిలిచింది.
ఉక్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్ లో భారత్ జట్టు తరఫున ఆర్జీత్ సింగ్ నాలుగు గోల్స్ (4, 18, 47, 54వ నిమిషాల్లో గోల్స్) తో సత్తా చాటగా.. దిల్ రాజ్ సింగ్(19వ) ఓ గోల్ కొట్టాడు.
ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే పాకిస్థాన్ గోల్ నమోదు చేసి దూకుడు కనబర్చింది. పాకిస్థాన్ తరఫున హనన్ షాహిత్(3వ నిమిషం).. సుఫియాన్ (30, 39వ నిమిషంలో) రెండు గోల్స్ నమోదు నమోదు చేశాడు. ఫస్ట్ క్వార్టర్‌లో ఇరు జట్లు 1-1 గోల్స్ సాధించగా… రెండో క్వార్టర్ క్వార్టర్ ఆరంభంలోనే ఆర్జీత్ సింగ్ మరో గోల్ సాధించాడు. నిమిషం వ్యవధిలోనే దిల్‌రాజ్ సింగ్ మరో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. రెండో క్వార్టర్ చివర్లో సుఫియాన్ గోల్ నమోదు చేయడంతో భారత్ – 3, పాక్ – 2 పాయింట్లతో ఫస్టాఫ్ ముగిసింది.
ఇక సెకండ్ ఆఫ్ లో బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఇరు జట్లూ ప్రయత్నించాయి. ఈ క్రమంలో పాక్ తరుఫున సుఫియాన్ 39వ నిమిషంలో గోల్ నమోదు చేసి స్కోర్లను సమం చేశాడు. దాంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.
చివరి నాల్గో క్వార్టర్ ఆరంభంలోనే ఆర్జీత్ సింగ్ గోల్ కొట్టి భారత్‌ను మరోసారి ఆధిక్యంలో నిలిపగా… మరో ఏడు నిమిషాల వ్యవధిలోనే మరో గోల్ సాధించాడు. దీంతో భరత్ 5 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట చివరి 6 నిమిషాల్లో గోల్ కోసం పాకిస్థాన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో పాక్ పై భారత జట్టు 5-3 పాయింట్లతో విజయం సాధించి.. జూ. ఆసియా కప్ టోర్నీని ముద్దాడింది.