Friday, November 22, 2024

INDvsENG | టెస్టు సమరానికి సై..! నేటి నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టెస్టు

హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో టీమిండియాకు అసలైన పరీక్ష మొదలు కాబోతుంది. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభమవుతోంది. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా నేడు (గురువారం) హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్‌ ఉదయం 9:30 నుంచి మొదలవుతోంది. మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

ఉప్పల్‌ స్టేడియాన్ని కొత్త హంగులతో ముస్తాబు చేశారు. 2018 తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. ఐదు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన బధ్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా మైదానం లోపల, బయట సీసీ కెమరాలతో గట్టి నిఘా ఉంచారు. పాఠశాల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగుల కుటుంబాలు మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశాలను హెచ్‌సీఏ కల్పించింది.

ఇక మ్యాచ్‌ కోసం భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. టెస్టుల్లో అద్భుత రికార్డులు కలిగిన టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు బజ్‌బాల్‌ క్రికెట్‌ జట్టుగా పేరు సాధించిన ఇంగ్లండ్‌ అదే జోరుతో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఇరుజట్లు మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌ రసవత్తంగా సాగడం ఖాయమనిపిస్తోంది. కాగా ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా మంచి రికార్డు ఉంది. భారత జట్టు ఉప్పల్‌లో ఇప్పటీవరకు ఐదు టెస్టులు ఆడింది. అందులో నాలుగింటిలో విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ డ్రా అయింది.

స్పెషలిస్ట్‌ బ్యాటర్లు లేకుండానే..

- Advertisement -

అసలు సీసలైన టెస్టు సిరీస్‌లో టీమిండియాకు మొదటి టెస్టులోనే కష్టాలు తప్పవన్నట్లు కనిపిస్తోంది. టెస్టు స్పెషలిస్ట్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే లేకుండానే టీమిండియా పటిష్టమైన ఇంగ్లండ్‌తో ఢీ కొనేందుకు సిద్ధమైంది. ప్రస్తుత జట్టులో రోహిత్‌ శర్మ ఒక్కడే అనుభవగ్నూడైన ప్లేయర్‌. తర్వాత కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానంలో ఉంటాడు. మిగతా ఆటగాళ్లందరూ పెద్దగా టెస్టు మ్యాచ్‌లు ఆడింది లేదు.

కీలక ఆటగాడు విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మరోవైపు సీనియర్లు పుజారా, రహానేకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇలాంటి సమయంలో యువ ఆటగాళ్లతో రోహిత్‌ శర్మ టీమిండియాను ఎలా గెలిపిస్తాడో పెద్ద సవాల్‌గా మారింది. కేఎల్‌ రాహుల్‌, గిల్‌, యశస్వి, అయ్యర్‌లు ఎలా బ్యాటింగ్‌ చేస్తారో చూడాలి. ఆంధ్ర కుర్రాడు కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు.

టీమ్‌లో కొనసాగాలంటే ఇతను కీపింగ్‌తో పాటు బ్యాట్‌ ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బౌలింగ్‌లో అశ్విన్‌, జడేజాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు బాల్‌తో పాటు బ్యాట్‌తోను రాణించగలరు. మరోవైపు మూడో స్పిన్నర్‌గా కుల్దిప్‌, అక్షర్‌ పటేల్‌ మధ్య గట్టి పోటీ ఉంది. పేస్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు లోకల్‌ బాయ్‌ మహ్మద్‌ సిరాజ్‌ బరిలోకి దిగనున్నారు.

2012 నుంచి మనదే ఆదిపత్యం..

సొంత గడ్డపై భారత్‌కు ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. గత 12 ఏళ్లలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన అన్ని టెస్టు సిరీస్‌లలో టీమిండియా విజయాలు సాధించింది. 2012లో చివరిసారి భారత్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి టీమిండియాదే ఆదిపత్యం నడుస్తోంది. అప్పటి నుంచి భారత జట్టు స్వదేశంలో బ్రిటీస్‌ జట్టుపై ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

ఒవరాల్‌గా కూడా భారత్‌దే హవా ఉంది. 1932 నుంచి ఇప్పటి వరకు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య మొత్తం 131 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా 50 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఇంగ్లండ్‌ మాత్రం 31 టెస్టులు నెగ్గింది. భారత గడ్డపై చూసుకుంటే ఇరు జట్లు మొత్తం 54 మ్యాచుల్లో తలపడగా.. అందులో భారత జట్టు 22 సార్లు.. బ్రిటీష్‌ జట్టు 14 సార్లు గెలిచింది.

మా ఆటపైనే మా దృష్టంతా: కెప్టెన్‌ రోహిత్‌

బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రత్యర్థి జట్టు ఎలా ఆడుతుందో నాకు ఆసక్తి లేదు. మేము మైదానంలో ఎలా ఆడుతామన్నదే ముఖ్యం. ప్రస్తుతం మనం ఎలా ఆడాలి దానిపైనే ఫోకస్‌ పెట్టాం. ప్రస్తుతం మా బాయ్స్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతంగా రాణించారు. అక్కడి ఫలితాలు సంతృప్తి నిచ్చాయి. ఇక సొంత గడ్డపై టీమిండియా రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేయలేము.

ప్రపంచ అగ్రశ్రేణి జట్లలో ఇంగ్లండ్‌ కూడా ఒకటి. స్వదేశంలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తామని కచ్చితంగా చెప్పలేను. ఆట అన్నప్పుడు గెలుపు ఓటములు సహాజం. అందుకే ఎవరైనా గెలువచ్చు.. ఎవరైనా ఓడచ్చు. కానీ మేము గెలుపు కోసం వంద శాతం శ్రమిస్తాం. కలిసికట్టుగా రాణిస్తే విజయాలు సాధించడం కష్టమేమి కాదు. అందరికి తమ తమ బాధ్యతలు తెలుసు. అందరూ ఈసారి కూడా మెరుగైన ప్రదర్శనలు చేస్తారని ఆశిస్తున్నాను అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

ముగ్గురు స్పిన్నర్లతో ఇంగ్లండ్‌..

భారత్‌తో మొదలు కానున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు ఈసీబీ చోటు కల్పించి ఆశ్చర్య పరిచింది. ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ దూరమవడంతో అతని స్థానంలో మార్క్‌వుడ్‌కు అవకాశం కలిపించారు. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మార్క్‌వుడ్‌ ఒక్కడే స్పెషలిస్ట్‌ పేసర్‌ కావడం విశేషం. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లండ్‌ ముగ్గురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతో మరిలోకి దిగేందుకు సిద్ధమైంది. స్పిన్నర్లలో రెహన్‌ అహ్మద్‌, జాక్‌ లీచ్‌, టామ్‌ హార్ట్‌ లీ చోటు దక్కించుకున్నారు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టీమ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. స్టోక్స్‌, బెయిర్‌ స్టో, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ ఫోక్స్‌, జో రూట్‌ తదితరులతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ విభాగం స్ట్రాంగ్‌గా ఉంది.

జట్ల వివరాలు (అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మాన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

ఇంగ్లండ్‌: జక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఒల్లిd పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), టామ్‌ హార్ట్‌ లీ, బెన్‌ ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), రెహాన్‌ అహ్మద్‌, మార్క్‌వుడ్‌, జాక్‌ లీచ్‌.

10.. భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో 10 వికెట్లు పడగొట్టితే 500 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు. టెస్టుల్లో అశ్విన్‌ ఇప్పటి వరకు 490 వికెట్లు తీశాడు.

సచిన్‌ రికార్డుకు చెరువలో రూట్‌..

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మరో 10 పరుగులు చేస్తే భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును దాటేస్తాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్‌ (2535) పరుగులు టాప్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో కొనసాగుతున్న జో రూట్‌ (2526) మరో 10 పరుగులు చేస్తే నెంబర్‌-1 స్థానాన్ని సొంతం చేసుకుంటాడు.
1.. 2011 నవబంర్‌ నుంచి భారత టెస్టు స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు లేకుండా టీమిండియా టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ప్రతిసారి వీరిలో ఎవరైనా తప్పనిసరిగా భారత జట్టులో ఉంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఈ ముగ్గురు లేకుండానే భారత్‌ టెస్టుకు సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement