Tuesday, November 26, 2024

ఇంగ్లండ్ టీ20 సిరీస్ లో భారత్‌ బోణి.. హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ షో

ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా బోణి కొట్టింది. గురువారంనాడు జరిగిన తొలి మ్యాచ్‌ (డే అండ్‌ నైట్‌) లో రోహిత్‌ సేన 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్నాడు. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా బ్యాటింగ్‌కు విషయానికొస్తే… ఒక్క ఇషాన్‌ కిషన్‌ మినహా… మిగతా ఆటగాళ్లందరూ దూకుడుగా రాణించారు. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయాడు. 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 33 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లను భారత బౌలర్లు మొదట్నుంచే కట్టడి చేశారు. ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. భువనేశ్వర్‌కుమార్‌ ఇంగ్లండ్‌ జట్టుకు తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. అతడు వేసిన తొలి ఓవర్‌ ఐదో బంతికి బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌(0) క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఇక నాలుగో ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా ఇంగ్లండ్‌కు ఒకే ఓవర్‌లో డబుల్‌ షాకులిచ్చాడు. రెండో బంతికి డేవిడ్‌ మలన్‌(21)ను బౌల్డ్‌ చేసిన పాండ్యా, ఆఖరి బంతికి ప్రమాదకర లివింగ్‌ స్టోన్‌(0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఓవర్‌లో జాసన్‌ రాయ్‌(4)ను కూడా పాండ్యా ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇలా ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ ఎవ్వరికీ ఆడే చాన్స్‌ ఇవ్వలేదు. మొయిన్‌ అలీ, క్రిస్‌ జోర్డాన్‌ మాత్రమే కాస్త మెరుపులు మెరిపించారు. మిగిలిన వాళ్లు వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. దీంతో 148 పరుగులకే ఇంగ్లండ్‌ కుప్పకూలింది. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యాకు 4 వికెట్లు దక్కగా… చాహల్‌, అర్ష్‌దీప్‌ సిగ్‌కు రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షల్‌, భువనేశ్వర్‌ కుమార్‌కు తలో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 50 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. సిరీస్‌లో 1-0తేడాతో ముందంజలో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement