టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మరో కీలక సమరానికి రెడీ అయ్యింది. కివీస్‌తో నేడు మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాకిస్థాన్ చేతిలో జరిగిన పరాభవం నుంచి బయటపడాలని భావిస్తోంది. అయితే టీమిండియా, న్యూజీలాండ్ ఈ రెండు జట్లు ఇప్పటి దాకా ఖాతా తెరవలేదు. దీంతో నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా విజయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఒకవేళ నేటి మ్యాచ్‌లో కనుక భారత్ ఓటమి పాలైతే సెమీఫైనల్ అవకాశాలు కష్టతరంగా మారుతాయి. అయితే కివీస్ కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్ ఎదుర్కొంటోంది. దీంతో నేటి కివీస్-భారత్ మ్యాచ్‌ను క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆఫ్గాన్ నేటి మ్యాచ్‌లో నమీబియాను చిత్తుచేస్తే గ్రూప్ 2 పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు మెరగవుతాయి. ఈ గ్రూపులో ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదుంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్‌లపైనే అందరూ దృష్టిసారించారు.
ఈ ప్రపంచకప్‌లో ప్రారంభం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏమంత కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓడిపోవడం ద్వారా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన తొలి భారత స్కిప్పర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. అయితే, పడిన ప్రతిసారి లేవడం టీమిండియా అలవాటైన పనే కావడంతో అభిమానులు ధీమాగా ఉన్నారు.
గత అనుభవాలు..
అడిలైడ్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టులోనూ భారత్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా వరుస విజయాలతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కాబట్టి ఈసారి కూడా కోహ్లీసేన పడిలేచే కెరటంలా మళ్లీ పుంజుకుంటుందని అభిమానులు ఆశగా ఉన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియాకు దాదాపు వారం రోజుల వ్యవధి దొరికింది. జట్టులోని లోపాలను సరిచేసుకునేందుకు ఇది చక్కని అవకాశం. అయితే, రెండు మ్యాచ్‌ల మధ్య ఇంత దూరం చేటు చేస్తుందని కూడా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టీ20లాంటి పొట్టి మ్యాచ్‌ల్లో దూరం అంతమంచిది కాదని చెబుతున్నారు క్రికెట్ అనలిస్టులు.
కివీస్‌తో అంత వీజీ కాదు..
న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం టీమిండియాకు అంత సులభమైన పనేమీ కాదంటున్నారు చాలామంది విశ్లేషకులు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ను చిత్తుచేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లోనూ కివీస్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 2003 తర్వాత ఐసీసీ ట్రోఫీల్లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచింది లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓటమికి ఆరో బౌలర్ లేకపోవడమే కారణమని భావించిన కోహ్లీ సేన నేటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ వేయాలని నిర్ణయించుకుంది. నెట్స్‌లో నిన్న పాండ్యా బంతితో చెమటోడ్చాడు. అవసరమైతే పాండ్యా బౌలింగ్ చేస్తాడని కోహ్లీ చెప్పాడు. పాండ్యా ఫిట్‌గా ఉంటే కనుక అతడితో ఒకటి రెండు ఓవర్లు వేయిస్తామని చెప్పుకొచ్చాడు.
మన బౌలింగ్ మెరుగైతేనే..
భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి బౌలర్లు పాకిస్థాన్‌పై తేలిపోయారు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో వారు మరింత రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే, శార్దూల్ ఠాకూర్ ప్రాముఖ్యాన్ని కూడా కెప్టెన్ కోహ్లీ గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌లో మార్పులు ఉండకపోయినా బౌలింగ్ విషయంలో మాత్రం జట్టులో కొంత మార్పు కనిపించే చాన్సెస్ ఉన్నాయి. అయితే, జట్టులోకి వచ్చేది సీనియర్ బౌలర్ అశ్వినా లేదంటే యువ ఆటగాడు ఠాకూరా? అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది.