టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది టీమిండియా. దీనికి ముందు పెర్త్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడిన జట్టు ఒక దానిలో నెగ్గి, రెండో దానిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచుల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడలేదు. అయితే.. రెండో మ్యాచులో కోహ్లీతోపాటు సూర్యకుమార్ కూడా ఆడకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇక.. ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చివరగా మరో రెండు వామప్ మ్యాచులు ఆడేందుకు రెడీ అయ్యింది. వీటిలో జట్టు వ్యూహాలకు తుదిమెరుగులు దిద్దుకునే చాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం భారత జట్టు బ్రిస్బేన్ చేరుకుంది. టీమిండియా క్రికెటర్లు బ్రిస్బేన్ చేరుకున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ వీడియోలో భారత ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు. ఇక్కడి గబ్బా మైదానంలో తొలుత ఆస్ట్రేలియాతో, అనంతరం న్యూజిల్యాండ్‌తో భారత జట్టు వామప్ మ్యాచులు ఆడనుంది. అనంతరం వచ్చే ఆదివారం పాకిస్తాన్‌తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది.