ఆస్ట్రేలియా మహిళలతో నేడు జరిగిన వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ సేన 122 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమిపాలైన భారత మహిళల జట్టు ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది.
కాగా, నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్… నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. జార్జియా వోల్స్ (101), ఎలీసా పెర్రీ (105) మెరుపు శతకాలు బాదారు. ఓపెనర్ ఫోబే లిచ్‌ఫీల్డ్ (60), కెప్టెన్ బెత్ మూనీ (56) అర్ధ శతకాలతో రాణించారు. ఇక భారత బౌలర్లలో సైమా ఠాకూర్ (3/62) మూడు వికెట్లు, మిన్ను మణి (2/71) రెండు, ప్రియా మిశ్రా (1/88), దీప్తి శర్మ (1/59), రేణుకా ఠాకూర్ సింగ్ (1/78) తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 44.5 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌటైంది. రిచా ఘోష్ (54) హాఫ్ సెంచరీ సాధించగా.. మిన్ను మణి (46), జెమీమా రోడ్రిగ్స్ (43), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌లాండ్ నాలుగు వికెట్లు, మేఘన స్కట్, కిమ్ గార్త్, గార్డెనర్, సోఫీ, అలనా తలో వికెట్ తీశారు.