వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ విజయం సాధించింది. గుజరాత్‌లోని వడోదర స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విడీస్ ను చిత్తుగా ఓడించి తొలి వన్డే మ్యాచ్ ను సొంతం చేసుకుంది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దంచికొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది. భారత వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ ఏడాదిలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా మూడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
నేటి మ్యాచ్ లో ఓపెనర్లు స్మృతి మంధాన (91), ప్రతీకా రావల్ (40) చెలరేగారు. హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31), దీప్తి శర్మ (14 నాటౌట్) దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్ జైదా జేమ్స్ (5/45) ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. హీలీ మాథ్యూస్ 2, డాటిన్ ఒక వికెట్ తీశారు.
అనంతరం భారీ టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు… 103 పరుగులు చేసి 26.2 ఓవర్లకే కుప్పకూలింది. అఫీ ఫ్లెచర్ (24) హై స్కోరర్. భారత బౌలర్లలో రేణుకా సింగ్ (5/29) ఫైఫర్ తో చెలరేగింది. ప్రియా మిశ్రా (2/22) రెండు వికెట్లు తీయగా.. టిటాస్ సాధు, దీప్తి శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
దీంతో భారత జట్టు 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో వన్డే మ్యాచ్ ఈ నెల 24వ తేదీన జరగనుంది. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది.