Saturday, October 5, 2024

IND vs USA | అర్ష‌దీప్ సంచ‌ల‌నం..

ద‌నా ధ‌న్ క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌దే త‌ప్ప నియంత్ర‌ణ అనేది క‌ష్ట‌మే…. అయితే యూఎస్‌ఏపై భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అశ్విన్‌ (4/11) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన మొదటి భారత బౌలర్‌గానూ ఘనత సాధించాడు. యూఎస్‌ఏ బ్యాటర్ షయాన్‌ జహంగీర్ (0)ను తొలి బంతికే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కావడం గమనార్హం.

నాపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్‌: అర్ష్‌దీప్

”గత రెండు మ్యాచుల్లో ఎక్కువ పరుగులు ఇచ్చా. నా ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్నా. నా మీద నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు ధన్యవాదాలు. ఇప్పుడీ ప్రదర్శనతో సంతోషంగా ఉంది. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంది. వికెట్లే లక్ష్యంగా బంతులేయాలనేది మా సూత్రం. అందుకు తగ్గట్టుగానే బౌలింగ్‌ చేశా. పరుగులు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా బంతులేశాం. ఇలాంటి పిచ్‌పై అనవసరంగా పరుగులు ఇస్తే లక్ష్య ఛేదన మరింత క్లిష్టంగా మారుతుంది. మా బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేటప్పుడు పిచ్‌ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా బౌలర్లూ రాణించడంతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాం. సూపర్ – 8లోనూ ఇదే బౌలింగ్‌తో మ్యాచుల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తాం” అని అర్ష్‌దీప్ వ్యాఖ్యానించాడు. అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement