భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దాంతో, అంపైర్లు టాస్ ఆలస్యంగా వేయనున్నారు. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో గెలుపొందిన భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ లంకను ఓడించాలని సూర్యకుమార్ యాదవ్ బృందం భావిస్తోంది. మరోవైపు నామమాత్రమైన ఈ మ్యాచ్‌లోనైనా విజయంతో పరువు కాపాడుకోవాలని లంక పట్టుదలతో ఉంది.
ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20కి వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో, భారత ఇన్నింగ్స్‌ను 8 ఓవర్లకు కుదించారు.
ఇప్పుడు మూడో టీ20కి కూడా మళ్లీ వరుణుడు అడ్డుపడ్డాడు. వాతావరణ శాఖ చెప్పినట్టే మ్యాచ్ సమయానికి ముందే పల్లెకెలెలో చినుకులు మొదలయ్యాయి. మ్యాచ్ జరగాల్సిన స్టేడియంలోనూ భారీ వర్షం కురిసింది. దాంతో, మైదాన సిబ్బంది పిచ్, ఔట్‌ఫీల్డ్ మొత్తాన్ని టార్పాలిన్ కవర్లతో కప్పేశారు.