సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ తగిలింది. కీలకమైన రెండో టెస్టుకు ముందు ఆ జట్టు కీలక ఆటగాడు గెరాల్డ్ కొట్జీ దూరమయ్యాడు. తొలి టెస్టు సందర్భంగా గాయపడిన గెరాల్డ్ కొట్జీ రేపటి (బుదవారం) నుంచి జరిగే ఆఖరి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది.
ఇక, అతడి స్థానంలో లుంగి ఎంగిడి బరిలో దిగనున్నాడు. నెట్‌లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే కెప్టెన్ బవుమా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టు తొలి రోజే ఫీల్డింగ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో బవుమా మైదానం వీడాడు. రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న డీన్ ఎల్గర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
భారత జట్టులో ఆవేశ్‌ఖాన్
వన్డేలు, టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బౌలర్ అవేశ్ ఖాన్‌కు టెస్టుల్లోకి పిలుపొచ్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో జట్టులోకి అవేశ్‌ఖాన్ ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ కోసం ఫిట్‌నెస్ సాధించని మహమ్మద్ షమీ స్థానంలో ఇప్పటిదాకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇప్పుడు కేప్‌టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం షమీ స్థానంలో అవేశ్‌కు చోటు కల్పించారు.