కేప్‌టౌన్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. సిరీస్ డిసైడర్ అయిన ఈ టెస్టులో ఇరుజట్ల బౌలర్ల విజృంభణతో ఒక్క రోజే 23 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ జట్టును 55 రన్స్‌కే పరిమితం చేసిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగించారు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. భారత్ కంటే దక్షిణాఫ్రికా 36 పరుగులు వెనుకబడి ఉంది.
రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన సఫారీలకు ముకేశ్ షాక్ ఇచ్చాడు. డీన్ ఎల్గర్(12)ను, అనంతరం టోని డి జొర్జి(1) పెవిలియన్ పంపాడు. కాసేపటికే బుమ్రా బౌన్సర్‌తో స్టబ్స్(0)ను వెనక్కి పంపడంతో ఎల్గర్ సేన 45 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ మర్క్రమ్(36 నాటౌట్), బెడింగ్హమ్(7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌటయ్యింది. రబడ, ఎంగిడి ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. తొలుత దక్షిణాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం రబడ, బర్గర్ దెబ్బకు కీలక వికెట్లు కోల్పోయింది. భారత జట్టులో మాజీ సారథి విరాట్ కోహ్లీ(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్(8), జడేజా(0), బుమ్రా(0)లను వెనక్కి పంపి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అనతంరం రబడా బౌలింగ్‌లో సిరాజ్ రనౌట్‌గా వెనుదిరగగా.. ప్రసిద్ కృష్ణ(0) క్యాచ్ ఇచ్చాడు. దాంతో టీమిండియా 153 పరుగులకే పరిమితమైంది. దాంతో, 98 పరుగుల ఆధిక్యం లభించింది.