Friday, October 18, 2024

IND vs NZ Test | రేప‌టి నుంచే కివీస్‌తో సిరీస్..

బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. రేపటి (బుధవారం) నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.

మరోవైపు శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. గాయం కారణంగా కీలక బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూరమవ్వడం కివీస్‌కు ప్రతికూలంగా మారింది. కాగా, భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా వన్డే, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్‌ 22, న్యూజిలాండ్‌ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.

- Advertisement -

అయితే తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. నేటి నుంచి బెంగళూరులో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మ్యాచ్ ప్రారంభమయ్యే బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉంది. టెస్టు ఆటలో మూడు రోజు (శుక్రవారం) మినహా మిగిలిన నాలుగు రోజులు వర్షం పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాతవారణ శాఖ ఈ వారం రోజులు బెంగళూరులో వర్షం పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఎల్లో వార్నింగ్ కూడా ఇచ్చింది. శుక్రవారానికి ఆరెంజ్ వార్నింగ్‌గా కూడా మార్చే అవకాశం ఉంది.

మోస్తారు వర్షం కురిస్తే మ్యాచ్‌ను సజావుగా సాగించే అవకాశం ఉంటుంది. చిన్నస్వామి స్టేడియానికి ఆధునిక డ్రైనేజి వ్యవస్థ కలదు. అయితే అవుట్‌ఫీల్డ్ సిద్ధమవ్వడానికి డ్రైనేజీ వ్యవస్థతో పాటు సూర్యని సాయం అవసరం. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దాదాపు రెండున్నర రోజుల పాటే ఆట సాగింది. కానీ టీమిండియా అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను గెలిచింది.

జట్టు వివరాలు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement