Monday, November 18, 2024

ICC | పెరిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రైజ్‌మ‌నీ !

ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కీల‌క నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళా టోర్నీల్లోనూ ప్రైజ్‌మనీ అందజేయనుంది. వచ్చే నెల యూఏఈ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024తోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

ప్రధాన టీమ్ క్రీడల్లో లింగ వివక్ష లేకుండా సమాన ప్రైజ్‌మనీ అందిస్తున్న క్రీడగా క్రికెట్ నిలిచిందని పేర్కొంది. ఈ మేర‌కు యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ 2024 విజేతకు ప్రైజ్‌మనీ 2.34 మిలియన్ల అమెరికా డాలర్లు లభించనున్నాయి.

225 శాతం పెరిగిన ప్రైజ్‌మనీ..

గతంలో టీ20 ప్రపంచకప్ విజేతకు 1 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్‌మనీగా ఇచ్చేవారు. తాజా నిర్ణయంతో రన్నరప్ టీమ్‌కు కూడా 1.17 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. గతంలో రన్నరప్‌కు హాఫ్ మిలియన్ అమెరికా డాలర్లు ఇచ్చేవారు. సెమీఫైనల్లో ఓడిన జట్లకు 675,000 చొప్పున ప్రైజ్‌మనీ దక్కనుంది. గతంలో ఈ జట్లకు 210000 అమెరికా డాలర్లు ఇచ్చేవారు.

ఐసీసీ తాజా నిర్ణయంతో మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరని 6 జట్లకు విజయానికి 31,154 అమెరికా డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కనుంది. మహిళల క్రికెట్‌ ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చెందేలా చేస్తుందని ఐసీసీ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement