జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటర్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టిలకు తొలి రౌండ్లోనే భారీ షాక్ తగిలింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 21-16, 18-21, 16-21 తేడాతో చైనీస్ తైపీ జోడీ తైపీయుస్ లు చింగ్ యో-యాంగ్ పొ హన్ చేతిలో ఓడి తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ జోడీ తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకుంది.
కానీ అదే జోరును తర్వాతి గేమ్‌లో కొనసాగించలేక పోయింది. దీంతో హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో చైనీస్ తైపీ జంట గెలిచి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. ఇక నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో మరోసారి చిరాగ్ జోడీ తడబడింది. దీంతో ఈ గేమ్‌ను చైనీస్ జంట గెలిచి టోర్నీలో ముందంజ వేసింది.
భారత జోడీ ప్రయాణం మాత్రం ముగిసింది. ఇక బుధవారం జరిగే పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు బరిలోకి దిగుతున్నారు. లక్ష్యసేన్‌కు తొలి రౌండ్లో పటిష్టమైన మూడో సీడ్ జపాన్ ప్రత్యర్థి కొడయి నారౌకాను ఢీ కొననున్నాడు. మరోవైపు ఏడో సీడ్ హెచ్ ఎస్ ప్రణయ్ తన తొలి రౌండ్లో హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియ్తో తలపడనున్నాడు.