న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కివీస్ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తానని చెప్పాడు.
2022లో కేన్ విలియమ్సన్ నుంచి జట్టు పగ్గాలను అందుకొన్న సౌథీ.. న్యూజిలాండ్ జట్టుకు 14 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. సౌథీ కెప్టెన్సీలో కివీస్ 6 మ్యాచ్‌లు గెలవగా.. 6 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక టామ్ లాథమ్ మరోసారి టెస్టు కెప్టెన్ పగ్గాలు అందుకోనున్నాడు.
తనకు కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్‌కు టిమ్ సౌథీ ధన్యవాదాలు తెలిపాడు. ‘న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. జట్టు విజయం కోసం చాలా కృషి చేశా. జట్టే నా తొలి ప్రాధాన్యతగా భావించా.
ఇక నుంచి నా వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారిస్తా. కివీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తా. సహచరులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. యువ బౌలర్లను ఎప్పటిలానే ప్రోత్సహిస్తాను. టామ్ లాథమ్‌కు ఆల్ ది బెస్ట్. అతడు విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని 35 ఏళ్ల సౌథీ పేర్కొన్నాడు. అక్టోబర్ 16 నుంచి భారత్‌తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు లాథమ్ నాయకత్వం వహిస్తాడు.