హైదరాబాద్ : తెలుగు తేజం, కడప జిల్లా పోరు మామిళ్లకు చెందిన పోతిరెడ్డి సందీప్ రెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం వేదికగా డిసెంబర్ 6-8న జరిగే ఐఎఫ్‌ఏఎఫ్ (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ ఫుట్‌బాల్) ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే భారత్ జట్టుకు సందీప్ రెడ్డి నాయకత్వం వహిస్తాడు. చీఫ్ కోచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 42 మందితో కూడిన జట్టు శిక్షణ బుధవారంతో హైదరాబాద్‌లో ముగిసింది. జట్టులో సందీప్ రెడ్డితో సహా ఏడుగురు తెలుగు ఆటగాళ్లయిన సంతోష్, కేతన్ ఓగ, రోహిత్ బండ, అవనీష్, శివ ప్రసాద్ గుండ, మణికంఠ వీరలు ఉన్నారు. 2018లో జరిగిన పోటీల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత్ జట్టు 10వ స్థానంలో నిలిచింది. 23 దేశాలు పాల్గొంటుండగా.. భారత్ గ్రూప్-ఏలో నిలిచింది. నాలుగుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీతో భారత్ గ్రూప్ దశలో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్-8లో నిలిచిన జట్లు 2022 బర్మింగ్ హమ్ వరల్డ్ గేమ్స్‌కు అర్హత సాధించనున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement