Wednesday, January 8, 2025

ICC | టెస్టుల్లో 2-టైర్‌ విధానం… అమలుకు ఐసీసీ ఒకే !

  • లాంగ్ ఫార్మాట్ కు పెరుగుతున్న ఆద‌ర‌ణ
  • త్వరలోనే టాప్‌ క్రికెట్‌ బోర్డులతో జైషా సమావేశం

టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టెస్టు క్రికెట్ లో 2-టైర్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇటీవల భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది

మెల్‌బోర్న్‌, సిడ్నీ మ్యాచుల్లో రికార్డు స్థాయిలో ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించారు. లాంగ్ ఫార్మాట్ క్రికెట్ కు మళ్లీ మెల్లగా క్రేజ్ రావడం విశేషం. టెస్టు క్రికెట్‌ను బ్ర‌తికించడానికి టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని కొందరు మాజీ క్రికెటర్లు ఇప్పటికే ఐసీసీకి సూచించారు.

ఈ క్రమంలో ప్రపంచ అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులైన బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులతో ఐసీసీ కొత్త చైర్మన్ జై షా త్వరలో సమావేశం కానున్న‌ట్టు తెలుస్తొంది. ఈ నెల 12న ముంబైలో జరిగే ఐసీసీ సమావేశంలో 2 టైర్ వ్యవస్థపై చర్చ జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

2-టైర్‌ విధానం అంటే ఏంటీ?

ఈ 2-టైర్ టెస్ట్ విధానంలో… టెస్టు క్రికెట్‌ ఆడే జట్లను రెండు డివిజన్లుగా విభజిస్తారు. డివిజన్‌-1లో ప్రదర్శన పరంగా అత్యుత్తమ జట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇందులో ఉన్న భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక వంటి జట్లు ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడాలి.

ఇప్పుడు సంవత్సరానికి ఒక్కోసారి మాత్రమే తమ దేశాల్లో ప్రత్యర్థులతో తలపడుతున్నాయి. అలా కాకుండా ఒకొక్క జట్టు మరోక జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. పటిష్టమైన జట్ల మధ్య అధిక మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

మరోవైపు డివిజన్‌-2లో బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌, అఫ్గనిస్తాన్ జట్లు ఉంటాయి. ఈ జట్లు కూడా తమ డివిజన్‌లో ఒకరితో మరొక్కరు తలపడాల్సి ఉంటుంది. అయితే ఇందులో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన ఒకటి లేదా రెండు జట్లకు డివిజన్‌-1లో చోటు కల్పించే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement