Tuesday, November 19, 2024

ఛాంపియన్స్‌ ట్రోఫీ మళ్లీ వస్తోంది..

అగ్రశ్రేణి వన్డే జట్ల మధ్య నిర్వహించే ఛాంపియన్స్‌ ట్రోఫీని పునఃప్రారంభించాలని ఐసీసీ నిర్ణయించింది. ఒక పద్ధతి లేని టీ20 ప్రపంచకప్‌ను ఇకపై రెండేళ్లకోసారి నిర్వహించనుంది. వచ్చే ఎనిమిదేళ్లలో జరిగే ఐసీసీ టోర్నీల వివరాలతో కూడిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)ను వెల్లడించింది. 2027 నుంచి జరిగే ప్రపంచకప్‌లలో 14 జట్లు ఉంటాయని ఐసీసీ తెలిపింది. ‘‘2024-2031 వరకు ఐసీసీ ఈవెంట్లను ఐసీసీ బోర్డు ధ్రువీకరించింది. టీ20, వన్డే ప్రపంచకప్‌లు రెండింటిలోనూ జట్లు పెరుగుతాయి. ఛాంపియన్‌ ట్రోఫీని తిరిగి ప్రవేశపెడతాం’’ అని ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనలో చెప్పింది. 

2027, 2031 ప్రపంచకప్‌లో 14 జట్లు, 54 మ్యాచ్‌లు ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌ జట్ల సంఖ్యను 20కి పెంచుతాం. 2024, 2026, 2028, 2030లో జరిగే ఈ టోర్నీల్లో 55 మ్యాచ్‌ల ఉంటాయి’’ అని ఐసీసీ తెలిపింది. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌ను 10 జట్లతో, టీ20 ప్రపంచకప్‌ను 16 జట్లతో నిర్వహిస్తున్నారు. ‘‘2025, 2029లో ఎనిమిది జట్లతో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుంది. 2025, 2027, 2029, 2031లో ప్రపంచ టెస్టు  ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఉంటాయి. ఐసీసీ   మహిళల ఈవెంట్ల షెడ్యూలు ఇంతకుముందే ఖరారైంది. మహిళల ప్రపంచకప్‌, మహిళల టీ20 ప్రపంచకప్‌లు రెండింటిలోనూ జట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ చివరగా 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement