కరోనా మహమ్మారి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ప్రభావం చూపుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మూడు సబ్-రీజినల్ క్వాలిఫయర్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీమెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తున్నది.
కాగా మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఫిన్లాండ్లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్స్, ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై బీసీసీఐ ఐసీసీని సంప్రదించినట్లు సమాచారం.