Monday, November 18, 2024

IND vs ZIM | నాలుగో టీ20 మ్యాచ్‌ కోసం భారీ మార్పులు..

జింబాబ్వే పర్యటనలో వరుస రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా… తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించింది. దాంతో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ సిరీస్ కైవసం చేసుకోవాలంటే నాలుగో టీ20లో విజయం సాధించడం టీమిండియాకు కీలకం. లేకుంటే ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆశసక్తి నెలకొంది.

టీమ్‌ కాంబినేషన్‌లో మార్పులు..

టీ20 ప్రపంచకప్ విజేతలు అందుబాటులోకి రావడంతో మూడో టీ20లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ తుది జట్టులోకి రాగా.. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్ ఉద్వాసనకు గురయ్యారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ముఖేష్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్‌ను ఆడించారు.

నాలుగో టీ20లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. టాపార్డర్ మొత్తం ఓపెనర్లతో నిండిపోవడంతో జట్టు సమతూకంపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ రాకతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగాడు. ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా మాత్రం నిరాశపరిచాడు.

- Advertisement -

అభిషేక్ శర్మపై వేటు….

ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేని నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు వేసి మిడిలార్డర్ బ్యాటర్ అయిన రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ చేయవచ్చు. మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో గెలిచినా.. బ్యాటింగ్ విభాగం తడబడినట్లు అనిపించింది.

ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌ను మరింత పటిష్టం చేయాలనే యోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఆవేశ్ ఖాన్‌కు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మను కొనసాగించాలనుకుంటే మాత్రం బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

జింబాబ్వేతో నాలుగో టీ20.. భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ/రియాన్ పరాగ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్/ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement