Thursday, September 19, 2024

Duleep Trophy | ఇండియా-ఎ జయభేరి

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో: దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌లో ఇండియా-ఎ జట్టు విజయభేరి మోగించింది. అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు 186 పరుగుల భారీ తేడాతో ఇండియా-డిపై భారీ విజయం సాధించింది.

488 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-డి చివరికి 82.2 ఓవర్లలో 301 పరుగులకే ఆలౌటైంది. తెలుగు తేజం రిక్కీ భుయ్‌ (113; 195 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) విరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. అతడికి ఇతర ప్లేయర్ల నుంచి సహకారం అందకపోవడంతో డి జట్టుకు ఓటమి తప్పలేదు.

ఇండియా ఎ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ శమ్స్‌ ములానీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌ ములానీ 89 పరుగులతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. కాగా, ఇండియా-ఎకి ఇది తొలి విజయం కాగా.. ఇండియా-డికి ఇది వరుసగా రెండో ఓటమి.

సెంచరీతో కదంతొక్కిన రిక్కీ భుయ్‌..

488 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా ఆదివారం చివరిదైన నాలుగో రోజు ఇండియా-డి 62/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు యష్‌దుబే, రిక్కీ భుయ్‌లు నెమ్మదిగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. యష్‌ దుబే 94 బంతుల్లో 5 బౌండరీల సహాయంతో 37 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. రెండో డౌన్‌లో వచ్చిన దెవ్‌దత్‌ పడిక్కిల్‌ కేవలం ఒక పరుగు చేసి శమ్స్‌ ములానీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

- Advertisement -

ఈ దశలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిక్కీ భుయ్‌ ఇండియా-డి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడుల్లా బంతిని బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడుతున్న సారథి శ్రేయస్‌ 55 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శామ్సన్‌ క్రీజులోకి వచ్చాడు.

ఇతను వచ్చి రావడంతోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆలరిస్తూ 45 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ కోల్పోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. రిక్కీ భుయ్‌ మాత్రం దూకుడుగా ఆడుతూ చూడచక్కని షాట్లతో అందరినీ అలరించాడు. ఈ క్రమంలోనే భుయ్‌ 170 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ కొద్ది సేపటికే తనుష్‌ కోటియన్‌ బౌలింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రిక్కీ భుయ్‌ (113) పెవిలియన్‌కి చేరాడు. ఆ తర్వాత సౌరభ్‌ కుమార్‌ (22), హర్షిత్‌ రాణా (24) కూడా ఔటవడంతో ఇండియా-డి ఇన్నింగ్స్‌ 301 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఇండియా ఏకు 186 పరుగుల విజయం దక్కింది. వీరి బౌలర్లలో శమ్స్‌ ములానీ 3, తనుష్‌ కొటియన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. రియన్‌ పరాగ్‌ ఖలీల్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement