2026 కామన్వెల్త్ క్రీడల నుంచి హాకీని తొలగిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడలకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం తదుపరి వేదిక కానుంది. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ రానుంది.
అయితే, అనూహ్యంగా ఈ క్రీడలకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. హాకీ, నెట్‌బాల్, రోడ్రేసింగ్ సహా మొత్తం తొమ్మిది ఈవెంట్లను కామన్వెల్త్ క్రీడల నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. 2022లో 19 ఈవెంట్లు నిర్వహించగా, ఈసారి ఈ సంఖ్యను 10కి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఒకవేళ ఇదే నిజమై హాకీని తొలగిస్తే భారత్‌కు ప్రతికూలం అవుతుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హాకీ ఐదు సార్లు పతకాలు సాధించింది. మూడుసార్లు రజతం, రెండుసార్లు కాంస్యం నెగ్గింది. మొత్తంగా 2022 క్రీడల్లో 61 పతకాలతో నాల్గవ స్థానంలో నిలిచింది. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో గరిష్టంగా 22 పతకాలు లభించాయి.